మొయినాబాద్, నవంబర్ 2: ‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా… అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయండి’ అంటూ ప్రజలు రోడ్డుపై ఫ్ల కార్డులతో నిరసన తెలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండల పరిధిలోని రెడ్డిపల్లి – వీరన్నపేట్ గ్రామాల మధ్య రెడ్డిపల్లి, వీరన్నపేట్ గ్రామాల ప్రజలు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లపై పడిన గుంతలను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు.
గుంతల మయంగా మారిన రోడ్లతో వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోవడంతో పాటు క్షతగాత్రులుగా గురవుతున్నారు. రోడ్లపై ప్రయాణం చేస్తే రోడ్డు టాక్స్ వసూలు చేస్తున్నారు. గుంతల రోడ్లతో ప్రమాదాలకు గురైన వారిని ఎవరు ఆదుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గుంతల రోడ్ల వలన ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు మరమ్మత్తు చేయకపోతే గ్రామాలలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకోవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
