మొయినాబాద్, జనవరి 27: హైదరాబాద్ మహా నగరానికి చేరువలో ఉండడంతో మొయినాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రకటించిన విధంగానే మున్సిపాలిటీ ప్రక్రియ కూడా అధికారికంగా పూర్తి చేసింది. గ్రామ పంచాయతీల్లో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకోవడం సోమవారం మొదలు పెట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్‌గా శరత్చంద్ర బాధ్యతలు స్వీకరించిన ఆయన తమ సిబ్బందితో వచ్చి గ్రామ పంచాయతీ రికార్డులు ఉండే బీరువాలను సీజ్ చేశారు. పంచాయతీ అధికారులకు గానీ, గ్రామ కార్యదర్శులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా గ్రామ పంచాయతీలను సందర్శించి గ్రామ పంచాయతీ రికార్డులో ఏమేమి ఉన్నాయో బీరువాలో పెట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీకి సంబంధించిన పూర్తి రికార్డులను మున్సిపల్ అధికారులకు అప్పగించడంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ స్టాప్ వేసి బిరువాలను సీజ్ చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన మొయినాబాద్, సురంగల్, ముర్తుజాగూడ, చిలుకూరు, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎన్కేపల్లి, ముర్తుజాగూడ గ్రామ పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకోవడానికి కమిషనర్ తమ సిబ్బందితో సోమవారం సాయంత్రం 5 గంటలకు మొయినాబాద్ గ్రామ పంచాయతీకి వచ్చి పంచాయతీల్లోని బీరువాలతో పాటు రికార్డులు ఉన్న గదులను సీజ్ చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యాలయాలకు ఎవరూ రావద్దని, మండల కార్యాలయానికి మాత్రమే వెళ్లాలని ఆదేశించారు. రాత్రి 8 గంటల వరకు మున్సిపాలిటీలో విలీనమైన 8 గ్రామ పంచాయతీలకు వెళ్లి రికార్డులు ఉన్న బీరువాలను, రికార్డులను ఉన్న ఆఫీస్‌లను సీజ్ చేసి వెళ్లారు. ఎప్పుడు వచ్చి రికార్డులు తీసుకెళ్తారో .. ఎక్కడ రికార్డులు భద్రపరుస్తారో అధికారులే ప్రకటించాల్సి ఉన్నది. గ్రామ పంచాయతీ కార్యాలయాల మీద పేర్లను కూడా తొలగించాలని, పేర్ల మీద రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.