మొయినాబాద్ మండలం, తోలుకట్టా గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంపై ఈ నెల 11న ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకోగా.. వాటిని సోమవారం రాజేంద్రనగర్ 13వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతితో వేలం పాట వేశారు. ప్రభుత్వానికి రూ.16,60,000 ఆదాయం సమకూరింది.
మొయినాబాద్, ఫిబ్రవరి 17 : పోలీసులకు పట్టుబడిన పందెం కోళ్లను న్యాయస్థానంలో న్యాయమూర్తి సమక్షంలో సోమవారం వేలం పాట వేశారు. పందెం కోళ్లను ఓపెన్ ఆక్షన్ పెట్టగా.. వాటిని దక్కించుకోవడానికి వందలమంది పోటీపడ్డారు. వేలం పాటలో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకుని పాల్గొన్నారు. పోలీసులకు పట్టుబడిన 84 పందెం కోళ్లను న్యాయమూర్తి వేలం పాట వేయగా రూ.16.60 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 11న కోడిపందేలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా కోడి పందేల శిబిరంపై దాడి చేసి 84 కోళ్లు, రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున విషయం తెలిసిందే. అయితే గత ఆరు రోజుల నుంచి పోలీసుల అదుపులో పెట్టుకున్న పందెం కోళ్లను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ 13వ అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రథమ కోర్టులో న్యాయమూర్తి అనుమతితో సోమవారం వేలం పాట వేశారు.
వేలం పాటలో కోడి పందెంరాయుళ్లకు సంబంధించిన వ్యక్తులే పాల్గొని పందెం కోళ్లను దక్కించుకున్నారు. కోడి పందేలలో వినియోగించిన 84 కోళ్లు సుమారు 400 కేజీల వరకు ఉండగా.. రూ.16.60 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 84 కోళ్లకుగాను ఒక రౌండ్‌కు 10 కోళ్ల చొప్పున తూకం చేసి 8 రౌండ్ల వరకు వేయగా.. 9వ రౌండ్లో 4 కోళ్లను వేలం పాట వేశారు.
పందెం కోళ్లు అత్యంత ఖరీదైనవి కావడంతో ఆ బీడ్ మరొకరికి దక్కనివ్వవద్దనే ఆలోచనతో కోళ్ల పందెంరాయుళ్లు వాళ్లే ఒక సిండికేట్‌గా ఏర్పడి కోళ్లను దక్కించుకున్నారు. 84 కోళ్లు సుమారుగా రూ.3 కోట్ల వరకు విలువ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పందెం కోళ్లరాయుళ్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి న్యాయస్థానంలో కోళ్లను ఓపెన్ యాక్షన్ వేయగా అందరూ పాల్గొనే అవకాశం ఇచ్చారు. కోళ్ల పందెంరాయుళ్లతో పాటు కొందరు స్థానికులు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. స్థానికంగా ఉండే ఓ యువకుడు వేలం పాటలో పాల్గొనడంతో పందెంరాయుళ్లు వేలం పాటలో పాల్గొనకుండా అడ్డుకోవడంతోపాటు కొంత భయభ్రాంతులకు గురి చేశారు.
నన్ను అడ్డుకుంటే చివరి వరకు వేలం పాటలో పాల్గొంటానని మొండిగా వ్యవహరించాడు. దీంతో పందెం రాయుళ్లు ఆ కోళ్లను ఎవరికి దక్కనివ్వవద్దనే ఆలోచనతో ఆ యువకుడికి రూ.2లక్షలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. చివరి మూడు రౌండ్ల నుంచి మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి విక్రంరెడ్డి వేలం పాటలో పాల్గొంటుండగా వేలలో పాల్గొనవద్దని కావాలంటే రెండు కోళ్లు ఇస్తామని ఆశ చూపారు. అయితే వినకుండా చివరి మూడు రౌండ్లలో వేలం పాటలో పాల్గొని వేలం పాటను పెంచి వదిలేశాడు.
వేలం పాటలో స్థానికులు పాల్గొంటుండంతో వాళ్లను పాల్గొననివ్వకుండా అడ్డుకోవడంతోపాటు వాళ్లు సిండికేట్ అవడాన్ని న్యాయమూర్తి గమనించారు. పందెంరాయుళ్లు ఈ కోళ్లను ఎలాగైనా దక్కించుకుంటారని, ఎంత వరకు వేలం పాట వేసినా కోళ్లను వదిలే పరిస్థితి లేదని న్యాయమూర్తి గుర్తించారు. మొదటగా 3 రౌండ్ల వరకు సర్కారు పాట రూ.15వేలు పెట్టగా.. 4వ రౌండ్ నుంచి కోళ్ల డిమాండ్‌ను బట్టి ఏకంగా రూ.లక్ష నుంచి వేలం పాట వేయడం మొదలుపెట్టారు. అయినా పందెంరాయుళ్లు కోళ్లను వదలకుండా ఎంత పెట్టినా పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.