మొయినాబాద్ : న్యాయ వ్యవస్థలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయ మూర్తి రుబినపాతీమా అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలో న్యాయ సేవలు-అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరికి చట్టాలపై అవగాహన లేకపోవడంతో అనవసరంగా శిక్షణకు గురవుతున్నారని చెప్పారు. మహిళలు, పిల్లలు వేదింపులకు గురవుతే ధైర్యంగా రక్షక భటులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచాలని ఇటీవలనే సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని గుర్తు చేశారు.
పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని చెప్పారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా నేరమని అన్నారు. బయట వ్యక్తులు కొన్ని ప్రలోభలకు గురి చేయడానికి ప్రయత్నిస్తారని మహిళలు, విద్యార్థులు నమ్మవద్దని సూచించారు. అనాథ పిల్లలకు, వృద్ధులకు న్యాయవ్యవస్థ ఉచితంగా న్యాయం సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కమిటీని ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా న్యాయ సలహాలను, కోర్టుల్లో వాదనలను వినిపించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే వనస్థలిపురంలో కొనసాగుతుందని గుర్తు చేశారు.
గ్రామ సర్పంచ్ ముదిగొండ మంజూల న్యాయమూర్తి రుబినాపాతిమాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు, సర్పంచ్ మంజూల, ఎస్ఐ నారాయణసింగ్, రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధానకార్యదర్శి సుదర్శన్, ఎగ్జిక్యూటీవ్ నంబర్ కుమార్‌యాదవ్, జ్ఞానేశ్వర్చారి, ఎన్టీఆర్ ట్రస్టు పాఠశాల డీన్ రామారావు, టీఆర్ఎస్ నాయకులు రవియాదవ్ పాల్గొన్నారు.