Moinabad | మొయినాబాద్, ఏప్రిల్19 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను, వాగ్దానాలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి అమలు చేయడంలో విఫలమై వాటిని కప్పి పుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు సంబంధించిన గోడ పత్రికలను శనివారం మొయినాబాద్ మున్సిపాలిటి కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోంపల్లి అనంతరెడ్డి, దారెడ్డి వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ప్రజలకు ఇష్టానుసారంగా వాగ్దానాలు , హామీలు ఇచ్చి ప్రస్తుతం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందనే ఆలోచనతో అధికారాన్ని కట్టబెడితే నేడు ప్రజలను పూర్తిగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిమాలిన అంశాలను ముందుకేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలు ఆటకెక్కించారని, హామీలను తుంగలో తొక్కడంతో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వరంగల్‌లో ఈ నెల 27న రజతోత్సవ మహాసభను 10 లక్షల మందితో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మహాసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని రాజకీయాల పట్ల పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తారని చెప్పారు. రజతోత్సవ సభతో ప్రజలు ఎక్కడ బీఆర్ఎస్ వైపు మళ్లుతారో అనే భయం రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందని ఎద్దెవా చేశారు.
మొయినాబాద్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలిరావడానికి సిద్దం కావాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు పంపడం జరుగుతుందని వచ్చిన వారికి ఆహారంతో పాటు మంచినీళ్ల సౌకర్యం కూడ కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవియాదవ్, అంజయ్యగౌడ్, విష్ణువర్దన్గౌడ్, కృష్ణమాచారి, మాజీ సర్పంచ్‌లు సుధాకర్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్త మాణిక్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కుమరి రాము, నాయకులు పూలస పరమేష్, షాబాద్ ప్రవీణ్, రాజుగౌడ్, జగన్, కరంచంద్, ఎన్ రాములు, తదితరులు పాల్గొన్నారు.