తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. పేదల కడుపు నింపే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. గత ఏప్రిల్ నెల నుంచి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నది. హరితహారం, క్రీడా ప్రాంగణాల నిధులను నిలిపివేసింది. వికారాబాద్ జిల్లాకు రూ.5కోట్లకు పైనే ఉపాధిహామీ నిధులు రావాల్సి ఉన్నది. అంతేకాకుండా రెండు నెలలుగా ఉపాధి కూలీల వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం చేస్తున్నది. ఇప్పటివరకు రూ.3కోట్ల మేర కూలి డబ్బుల చెల్లింపులు పెండింగ్ ఉన్నాయి.
మరోవైపు అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఎంతోమంది కూలీలకు ఉపాధి పని కరువైంది. జిల్లాలో కేవలం రెండేండ్లలో 50 లక్షల పనిదినాలను తగ్గించారు. వచ్చే ఏడాది మరో 20 లక్షల మేర పనిదినాలను తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతేడాది 19,998 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించగా, ఈసారి కేవలం 958 కుటుంబాలకు కల్పించారు. అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 9 నెలలు గడుస్తున్నా కనీసం వెయ్యి మందికి కూడా వంద రోజుల పనిని కల్పించలేదు.
వికారాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చింది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదానీలాంటి పెట్టుబడుదారులకు అప్పగించేలా ప్రైవేట్‌పరం చేస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం.. కరువును అధిగమించడమే లక్ష్యంగా కొన్నేండ్లుగా నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉపాధి హామీ తనిఖీల పేరిట పలు జిల్లాల్లో పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్ట్‌లతో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర పన్నుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కుట్రలతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు సంబంధించి కూడా నిధులను నిలిపివేసింది. తెలంగాణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, కల్లాలు, వైకుంఠధామాలకు సంబంధించి నిధులను కేంద్రం పూర్తిగా నిలిపివేసింది. సంబంధిత పనులన్నింటినీ పూర్తి చేసినప్పటికీ నిధుల మంజూరులో మాత్రం కేంద్ర ప్రభుత్వం దాదాపు గతేడాదిగా జాప్యం చేస్తూ వస్తున్నది. కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చి ఎన్నో కుటుంబాలకు ఉపాధిని దూరం చేసిన మోదీ ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు.
జిల్లాకు రావాల్సిన నిధులు రూ.7కోట్లు
ఉపాధి హామీ పథకంలో భాగంగా వివిధ పథకాల అమలుకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులను కేంద్రం నిలిపివేసింది. గత ఏప్రిల్ నుంచి జిల్లాకు రావాల్సిన మెటీరియల్ కాంపొనెంట్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ.5కోట్ల వరకు జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావాల్సి ఉంది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏటా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంటే, హరితహారం కార్యక్రమానికి కూడా నిధులను కేంద్రం నిలిపివేసింది. కోట్లలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంపొందించగా నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రం జాప్యం చేస్తున్నది.
హరితహారంతోపాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలుండాలని సదుద్దేశంతో ఏర్పాటు చేస్తే సంబంధిత క్రీడా ప్రాంగణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా అడ్డుపడుతున్నది. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలు అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కల్లాలను నిర్మించాలని నిర్ణయించి అన్ని గ్రామాల్లో కల్లాలను నిర్మిస్తే, కల్లాల నిర్మాణాన్ని కూడా ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు చెల్లింపుల్లోనూ కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నది. పనులు కొంతమేర జరుగుతున్నప్పటికీ సంబంధిత నిధులను కూడా రెండు, మూడు నెలల వరకు పెండింగ్‌లోనే పెడుతున్నది. జిల్లాలో రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు రూ.2కోట్ల వరకు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీలో తక్కువ పనులే ఉన్నప్పటికీ కూలీ డబ్బులు సమయానికి రాకపోయేసరికి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి లక్షల మంది పేద కుటుంబాల కడుపు కొట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. ఇందులో భాగంగానే తప్పుడు నివేదికలు తెప్పించుకొని అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారు. అందుకనుగుణంగానే గతేడాది నుంచి ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తున్నారు. కేవలం రెండేండ్లలో 50 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 103 లక్షల పనిదినాలను కల్పించగా, ఈ ఏడాది 31.41 లక్షల పనిదినాలను తగ్గించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మరో 20 లక్షల మేర పనిదినాలను తగ్గిస్తూ 50 లక్షల పనిదినాలను కల్పించాలని ప్లానింగ్ సిద్ధం చేశారు.
ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీ పనులు దూరం
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరు కావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా జాప్యం జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 9 నెలలు గడుస్తున్నా కనీసం వెయ్యి మందికి కూడా వంద రోజుల పనిని కూడా కల్పించలేకపోయారు. గతేడాది 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కేవలం 958 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనులను కల్పించారు. ఈ ఏడాది 71.60 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 49.15 లక్షల పనిదినాలను కల్పించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలతో జిల్లాలో ప్రస్తుతం రోజుకు కేవలం 2,775 మంది కూలీలు మాత్రమే హాజరవుతుండగా, గతేడాది ఇదే సమయంలో రోజుకు 11,630 మంది కూలీలు హాజరయ్యారు.