షాద్‌నగర్, ఆగస్టు22: రాష్ట్రంలో ప్రజాద్రోహి పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ శాసన సభ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ గురువారం షాద్‌నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నా నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీపై మొదటి సంతకం ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాటతప్పారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటి ఎన్నో వసతులను కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని, నేడు రైతులు నిత్యం ఆందోళన చెందే పరిస్థితి నెలకొందని వాపోయారు. రాష్ట్రంలో 47 లక్షల మంది వ్యవసాయ రుణగ్రహీతలు ఉన్నారని చెప్పిన ప్రభుత్వమే తాజా బడ్జెట్లో రుణమాఫీకి రూ.17వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
హామీలు నెరవేర్చకుంటే ఉద్యమిస్తాం
కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను వ్యవసాయ రుణం తీసుకున్నానని, మాజీ ఎమ్మెల్యేకు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. నేను రుణమే తీసుకోలేదని.. ఎలా మాఫీ అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తున్నారే తప్పా ప్రజలకు చేస్తున్న సేవ ఏమిటో చెప్పాలని అన్నారు.
ఈ నెల 15లోపు అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అయ్యిందా? అనే విషయాన్ని వివరించాలన్నారు. నేడు రైతు భరోసా, రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్ ధర లేదని ఆరోపించారు. రూ. 4వేల పింఛన్లు ఏమయ్యాయని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ ఇస్తున్నారని, మహిళలకు రూ. 2500 ఎక్కడా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలని, లేనియెడల రైతుల పక్షాన మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, మాజీ ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్, నాయకులు ఈటె గణేశ్, నారాయణరెడ్డి, సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, దేవేందర్‌యాదవ్, రాయికల్ వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, మురళీధర్‌రెడ్డి, బక్కన్నయాదవ్, కృష్ణ, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, రామకృష్ణ, వెంకట్రాంరెడ్డి, రాజ్యలక్ష్మి, ఉమాదేవి, రవియాదవ్, ప్రతాప్‌రెడ్డి, ఈశ్వర్‌రాజు, నర్సింహ, శంకర్, ఎండీ ఎజాజ్అడ్డు, మన్నె నారాయణయాదవ్, భీమారం వీరేశం, జమాల్‌ఖాన్, రామకృష్ణ, రవీందర్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్, శేఖర్‌రెడ్డి, విఠల్, రంగయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎండీ నిజాం, నరేందర్, శరత్‌కుమార్, అశోక్, శ్రీకాంత్, నవీన్‌కుమార్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.