షాద్‌నగర్, జూన్1 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల నేతలు ఉప ఎన్నికకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి పోటీలో నిలిచారు. గత మార్చి28న ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మార్చి 28న పోలింగ్ పక్రియ ముగిసినప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కమిషన్ ఫలితాలను జూన్ 2న వెల్లడిస్తామని ప్రకటించింది. దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొన్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారని, ఫలితం సాయంత్రం నాలుగు గంటల వరకు వెలువడే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటు హక్కును వినియోగించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు అధికంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని ప్రచారం జరుగుతున్నది. గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.