షాద్‌నగర్‌టౌన్, జూన్ 24: రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వొద్దని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రెవెన్యూ అధికారులకు సూచించారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటమాధవరావు ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రైతులు పొలాలకు ఉపయోగిస్తున్న బాటలను కొనసాగించే యూస్మెంట్ రైట్ కొనసాగించాలని, రైతుల పొలాల సర్వేలను త్వరితంగా పూర్తి చేయాలన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించకూడదని, సర్వేయర్లు రైతులకు అందుబాటులో ఉంటూ భూమి కొలతలు త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదే విధంగా రేషన్ దుకాణాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కొత్తూరు : కొత్తూరు అండర్‌పాస్ నిండా నీళ్లు నిండటంపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎన్ఎస్ఏఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే అండర్ పాస్ జలమయయింది. దీంతో ఎమ్మెల్యే ఆది, సోమ వారాలు వెనువెంటనే అండర్‌పాస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని సూచించారు. అండర్‌పాస్ సమస్యకు సరైన పరిష్కారం చూపకుండానే హైవేలను కొత్తూరు వై జంక్షన్, పెంజర్ల రోడ్డు వద్ద మూసివేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
రాకపోకలు బందు చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వ్యాపారాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోసారి సమస్య పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. ఆయన వెంట ఎన్హెచ్ఏఐ ఏఈ భానుశర్మ, ప్రాజెక్టు మేనేజర్ ఇబ్రహీం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, సీఐ నరసింహారావు, మాజీ సర్పంచ్ సుదర్శన్‌గౌడ్, నాయకులు వీరమోని దేవేందర్, జగన్, తదితరులు పాల్గొన్నారు.