బడంగ్ పేట, ఫిబ్రవరి 11 : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం నాగారంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు సబితారెడ్డికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడంలేదో.. ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గత సంవత్సరం కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని గ్రామాలకు ఒక్క పైసా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏం పని చేశారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఓట్లు అడుగుతారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వారు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అలాంటి పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి అవకాశమిస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అన్నారు. ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని సబితారెడ్డి అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల అయిపోయేంతవరకు అవిశ్రాంతంగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. మహేశ్వరం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. సబితమ్మ ఇలాకాలో కాంగ్రెస్ బీజేపీల కథలు నడవవని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆమె పేర్కొన్నారు.
గ్రామాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టాలంటే పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు గాని కాంగ్రెస్ నేతలు సభలకు సమావేశాలకు రావడంలేదని ఆమె ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో 72 వేల కోట్ల రైతు బంధు ఇవ్వడం జరిగిందన్నారు. 28 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఏనాడు కూడా కేసీఆర్ ప్రచారాల ఆర్భాటం చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఏదీ చేయకుండానే ప్రకటనలకు పరిమితం అవుతున్నారని విమర్శించారు. ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని ఆమె చురకలు పెట్టారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని ఆమె పరోక్షంగా అధికారులకు హెచ్చరిక చేశారు. అనంతరం కురుమ సంఘం నాయకులు బాలయ్య, పాండు, సురేశ్ కృష్ణయ్య, పర్వతాలు, చంద్రయ్య తదితరులను సబితారెడ్డి ఘనంగా సత్కరించారు.