బడంగ్‌పేట, జూన్ 11 : తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే చాంబర్లో మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డివిజన్ల వారీగా ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయని అడిగారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌పై చర్చించారు. అధికారులు వర్షాకాలంలో అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకట్రామ్, డీఈ యాదయ్య, ఏఈ భార్గవరెడ్డి, కౌన్సిలర్ సుమన్, రవీనాయక్, చప్పిడి లావణ్యా రాజు తదితరులు పాల్గొన్నారు.