ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, మహేశ్రెడ్డిల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పత్రిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డిలు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వచ్చాక ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్తో లక్షల మందిపై భారం పడనున్నదని, ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రం అందజేశారు.
– వికారాబాద్, మార్చి 6, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మార్చి 6 : ఊసరవెళ్లి రంగులు మార్చినట్లుగా.. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మాట్లాడుతున్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అందిస్తామని పార్టీ పెద్దలు గొప్పలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్ విషయంపై నోరు మెదపకుండా డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి రూ.20వేల కోట్ల వసూళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం సరికాదన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క, బట్టి విక్రమార్కలు ఎల్ఆర్ఎస్కు డబ్బులు చెల్లించవద్దని ప్రజల కోసం పాటుపడుతున్నామని నమ్మించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ విషయంపై హై కోర్టులో కేసు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ చెల్లింపులు లేకుండా ఉచితంగానే స్థలాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి డబ్బుల వసూలు చేయడం సరికాదన్నారు. అనంతరం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, నవీన్‌కుమార్, కృష్ణ, నాయకులు విజయ్‌కుమార్, రాంరెడ్డి, దేవదాసు, అశోక్, విజయ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
బడంగ్‌పేట, మార్చి 6 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎల్ఆర్ఎస్ పథకం ఉచితంగా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం గడువు మార్చి నెలాఖరుకు డెడ్‌లైన్ పెట్టడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని వాగ్ధానాలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని పిలిచారని ఆమె గుర్తు చేశారు. ప్రజలు నేడు నో ఎల్ఆర్ఎస్ అంటే నో కాంగ్రెస్ అని నినదిస్తారని అన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదన్నారు.
ఎల్ఆర్ఎస్ స్కీంకు ఎవరు డబ్బులు కట్టవద్దని ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి మాట మార్చుతున్నారన్నారు. ఎల్ఆర్ఎస్ మార్చి 31 కటాఫ్ తేదీ ప్రకటించడం సరికాదన్నారు. ప్రజలను దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పెట్టారని ఆనాడు సీతక్క అనలేదా.. అని ప్రశ్నించారు. ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మంత్రి కోమటిరెడ్డి కోర్టులో వేసిన పిల్ ఏమైందని ఆమె ప్రశ్నించారు.
ఈనెల చివరి తేదీలోగా ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్టిన గడువును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 25 లక్షల కుటుంబాలపై భారం పడుతున్నదన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్ల, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, చైర్మన్లు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా జనం పాల్గొన్నారు.