తాండూరు, మే 14 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ పట్టింది. జిల్లాలో వెనుకబడిన తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.134 కోట్లు కేటాయించడంతో ప్రతి గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు, మండల కేంద్రానికి రూ.కోటి, బషీరాబాద్ మండలానికి మరో రూ.3 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయిస్తూ ఎమ్మెల్యే ఆదివారం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి నిధులతోపాటు తాండూరు నియోజకవర్గంలోని పల్లెలు ఆర్థికంగా బలపడేందుకు ప్రతి గ్రామానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 లక్షల నిధులివ్వడంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ‘పల్లె పల్లెకు పైలెట్’ కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.
1200 వందలకు పైగా ప్రత్యేక నిధుల ప్రొసీడింగ్ కాపీలను అందజేసినట్లు తెలిపారు. వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు కూడడా రూ.36 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ప్రతిఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో తాండూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. విద్య, వైద్యంతో పాటు ప్రజలందరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.
చరిత్ర సృష్టిస్తున్న ప్రొసీడింగ్‌లు : రాజుగౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.50 లక్షల ప్రొసీడింగ్‌లను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అందించడం చాల సంతోషంగా ఉంది. గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే చెప్పిన విధంగా ప్రతి గ్రామంకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రూ.134 కోట్ల నిధులను తీసుకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిలో దూసుకుపోవడం చరిత్రలో ముందెన్నడూ చూడలేదు. ఇంతటి అభివృద్ధిని సాధిస్తున్న యువ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే.