కొడంగల్, నవంబర్ 11 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూర్, కోస్గి మండలాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామస్తులు, కొత్తపల్లి మండలంలోని దోరెపల్లి గ్రామానికి చెందిన 80మంది మైనారిటీలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోస్గి మండలంలోని కడంపల్లి గ్రామానికి చెందిన మహిళలు అంజిలమ్మ, కిష్టమ్మ, వెంకటమ్మ, లక్ష్మి, కిష్టమ్మ, ఎల్లమ్మ, పెద్ద వెంకటమ్మ, చిన్న వెంకటమ్మ, మంగమ్మ, సాయమ్మ, నీలమ్మ, చంద్రమ్మలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, అందరి చూపు బీఆర్ఎస్ వైపు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసేందుకే ఈ హామీలు చేస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ ఏం ఒరగబెట్టలేదని, ఓటు బ్యాంకులా మాత్రమే వాడుకోవడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి తెలంగాణ బిడ్డ బీఆర్ఎస్కు మద్దతు తెలపడం జరుగుతుందని, చీకటి రాజ్యం, స్కాంలను కోరుకునే వారు కాంగ్రెస్లో ఉండిపోతున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.