న్యూఢిల్లీ: తన పాటల్ని ఏ సినిమాలో వాడినా.. ఏ కచేరీలో పాడినా వెంటనే కోర్టుకెక్కే లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ తన పాటల్ని ఎవరు ఏ విధంగా వాడినా రైట్స్ రూపంలో ఇళయరాజాకు కొంత మొత్తం చెల్లించాలి. ఆయన కాపీ రైట్ హక్కుల కింద కేసు వేయడం ఆనాటి కొందరు పాత నిర్మాతలకు తలనొప్పిగా మారింది. దాంతో విసిగిపోయిన సదరు నిర్మాతలు.. వారి సినిమాల పాటల హక్కులను ‘సరిగమ’ ఆడియో సంస్థకు ఇటీవలే విక్రయించారు.
దాంతో మొత్తం 134 చిత్రాలకు చెందిన పాటల హక్కులు ‘సరిగమ’ చేతికి వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న ఇళయరాజా.. ఆ పాటల ప్రసార హక్కుల్ని పలు సంస్థలకు రాసిచ్చారు. ఆయా సంస్థలన్నీ ఇళయరాజా ఈ పాటలను ఉపయోగించవచ్చంటూ అనుమతులు ఇచ్చాయి. ఈ విషయం ‘సరిగమ’ వారి దృష్టికి వెళ్లింది. ఆ సంస్థ వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని విచారించిన కోర్ట్ ఆ పాటలను ఇళయరాజా వాడుకోవడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాతల దగ్గర కొనుగోలు చేసిన పాటల హక్కులు ‘సరిగమ’కే ఉంటాయని కోర్టు పేర్కొన్నది. ‘సరిగమ’వారి అనుమతి తీసుకొని మాత్రమే ఆ పాటలను ఉపయోగించుకోవాలని కోర్టు సూచించింది.