‘చిన్నప్పట్నుంచీ బిజినెస్ చేయాలని ఆలోచించే యువకుడు నాన్న బిజినెస్‌ని టేకప్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిస్థితు లేంటి? అసలు నాన్న బిజినెస్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ సమాధానాలు ఆసక్తిగా ఉంటాయి. కథ, ఇందులోని పాత్రలు పూర్తి వినోదాత్మకంగా సాగుతాయి’ అని సుహాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. శివాని నగరం కథానాయిక. గోపీ అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుహాస్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘నా కెరీర్లో త్వరగా పూర్తయి, విడుదల అవుతున్న సినిమా ఇదే. ఈ కథ వినగానే ఇందులోని ఎంటర్టైన్మెంట్కీ, ఎమోషన్‌కీ కనెక్టయిపోయాను. అనుకున్నదానికంటే సినిమా వందరెట్లు బాగా వచ్చింది. ఈ మధ్య నా సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందుకే కాస్త బ్రేక్ తీసుకొని ఈ సినిమా చేశాను. చాలామంది నా సక్సెస్‌ను కోరుకుంటున్నారు. మంచి హిట్ రావాలని ఆశిస్తున్నారు.
అలాంటి వ్యక్తులు ఉండటం నా అదృష్టం’ అన్నారు సుహాస్. కెరీర్ విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నానని, ‘హే బలవంత్’ రూపంలో పెద్ద విజయం తమ టీమ్‌కి రాబోతున్నదని, అందరికీ పేరు తెచ్చే సినిమా ఇదని సుహాస్ నమ్మకం వెలిబుచ్చారు. ‘తన అసోసియేట్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తమిళ అగ్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్న చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాను. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. నాది ఇందులో అత్యంత క్రూరమైనే పాత్ర. పైగా ఏజ్డ్ కేరక్టర్. నా లుక్ కూడా కొత్తగా ఉంటుంది.’ అని తెలిపారు సుహాస్.