యాచారం, జూన్ 4 : రైతు సంక్షేమం కోసం యాచారంలో సకల హంగులతో నూతన రైతు బజార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు క్వాలిటీ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం యాచారంలో రైతు బజార్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నేరుగా ఇక్కడే అమ్ముకునేందుకు రైతు బజార్ ఉపయోగపడుతుందన్నారు. ఫార్మసిటీనీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా భూసేకరణ చేపట్టబోమన్నారు. అవసరమైతే రైతుల ఇష్టంతో ఇస్తే ప్రస్తుత ధరను పరిహారం కింద చెల్లిస్తామన్నారు. ప్యూచర్ సిటీతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.
అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. మండలాన్ని కూరగాయల హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఆర్డిఓ అనంతరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేష్, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడిఏ సుజాత, తాహసిల్దార్ అయ్యప్ప, వ్యవసాయ శాఖ ఏవో రవినాథ్, రైతు కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు ఉన్నారు.