ఇబ్రహీంపట్నం, జూన్ 19 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి పలు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానికనుగుణంగా వర్తక, వాణిజ్య సంఘాలు, మున్సిపల్, పోలీసు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వర్తక, వాణిజ్య సంఘాలతో పాటు పోలీసు, మున్సిపల్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వర్తక, వాణిజ్య, ఇతర చిరువ్యాపారుల కోసం ఇప్పటివరకు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించే తైబజార్‌ను రద్దుచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తైబజార్ నిర్వహణతో వ్యాపారులు, వర్తకులు రోడ్డుకిరువైపులా ఉన్న చిరువ్యాపారస్తులు డబ్బులు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇకమీదట తైబజార్ వేలం నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతో పాటు చెరువుకట్ట మరమ్మతు కోసం రూ.20కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో పెద్దచెరువు సుందరీకరణతో పాటు చెరువుకట్ట మరమ్మతు పనులు చేపడుతామని ఆయన తెలిపారు. అలాగే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారితో పాటు అంబేద్కర్ చౌరస్తా, తహసీల్దార్ రోడ్లల్లో ప్రజలు ట్రాఫిక్‌తో ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ రోడ్లల్లో ట్రాఫిక్ సమస్య తీర్చటం కోసం పోలీసు అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు.
రోడ్డుకిరువైపులా అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ చేయటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అలాగే, ప్రతి బుధవారం సంతలో కూడా దుకాణాలు రోడ్డుపైనే పెట్టడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నదన్నారు. ప్రతిరోజు రోడ్డుకిరువైపులా హద్దులను ఏర్పాటు చేస్తామని, హద్దులోపలోనే వాహనాలు పార్కింగ్ చేయాలని అన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన బైపాస్‌రోడ్డును ఖానాపూర్ గేట్‌నుంచి నాగన్‌పల్లి రోడ్డువరకు బీటీరోడ్డుగా మారుస్తామని ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నంలో తరుచుగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నందున బైపాస్‌రోడ్డును వినియోగంలోకి తీసుకురావటం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్ మంగ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, ఏసీపీ కేవీపీ రాజు, సీఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సీఐ గురునాయుడు, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు.
యాచారం : నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి బుధవారం ఆయన పర్యటించారు. మండలంలోని మంథన్గౌరెల్లిలో రూ.20లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించగా, రూ.5లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కేసీతండాలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రాంభించారు. నల్లవెల్లిలో రూ.25లక్షలతో సీసీరోడ్లు, రూ,20లక్షలతో కమ్యూనిటీ భవనాలు ప్రారంభించారు. చింతపట్లలో రూ.20లక్షలతో సీసీరోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, ఎంపీటీసీలు కొర్ర జ్యోతి, లక్ష్మిపతి, లక్ష్మమ్మ, కాంగ్రెస్ నాయకులు రాచర్ల వెంకటేశ్వర్లు, అరవింద్, సంపత్, నర్సింహ, చెన్నయ్య, శ్రీను తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ ప్రధాన రహదారి నుంచి చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా బొంగుళూరు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూమిపూజ చేశారు.
రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన సందర్భంగా బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మిగిలిపోయిన అన్ని రహదారులను విస్తరిస్తామని ఆయన తెలిపారు. అలాగే, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు త్వరలో అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, చర్లపటేల్‌గూడ ఎంపీటీసీ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నరేందర్, కరుణాకర్, రవీందర్, శేఖర్ తదితరులున్నారు.