కొత్తూరు, ఆగస్టు 3: నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిన్నారులు ఆల్బెండజోల్ మాత్ర లు తప్పని సరిగా వేసుకోవాలన్నారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నదని వివరించారు. కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ చిందకింది రాజేందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, యాదయ్య పాల్గొన్నారు.
వ్యక్తిగత శుభ్రతను పాటించాలి
యాచారం : విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఎంపీపీ సుకన్య సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. కార్యక్రమంలో మండల వైద్యధికారి రాజ్యలక్ష్మి, డాక్టర్ ప్రియాంక, ఎంపీడీవో విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి
చేవెళ్ల రూరల్ : ఆరోగ్య వంతమైన చిన్నారుల కోసం ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ భారతి అన్నారు. ఖానాపూర్ అంగన్వాడీ కేంద్రం, చన్వెల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా గురువారం అల్బెండజోల్ మాత్రలు వేసిన అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ విధిగా నులి పురుగుల నివారణ మందును అందించాలని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, వైద్యుడు కిరణ్‌కుమార్, ఎంపీహెచ్‌ఈవో సుధీర్‌బాబు, హెచ్ఎం విజయమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయక్‌అలీ, ఆయుష్ వైద్యుడు సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేటలోని జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న నులి పురుగుల నివారణ మందు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికీ నులి పురుగుల నివారణ మందు వేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి, హెచ్ఎం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : నులిపురుగుల మందు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని శంకర్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నులిపురుగుల మందును పిల్లలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రేవతిరెడ్డి,ప్రిన్సిపాల్ మహేశ్వర్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాత్రలు అందజేత
ఇబ్రహీంపట్నం : 19 ఏండ్లలోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ధరణికుమార్, వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్ : మండల పరిధిలోని ఎలిమినేడు ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో కలిసి ప్రముఖ సంఘ సేవకుడు భిక్షపతి విద్యార్థులకు నట్ట ల నివారణ మాత్రలను వేశారు. నట్టల నివారణకు ప్రతి చిన్నారికీ ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : శారీరకంగా ఎదుగుదల సవ్యంగా ఉండేందుకు నులి పురుగుల మందును అందజేయాలని మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి సంఘీనగర్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మందులను అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : గ్రామాల్లో చిన్నారులకు తప్పనిసరిగా నులిపురుగు నివారణ మాత్రలు వేయించాలని షాబాద్ ప్రభుత్వ దవఖాన డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కుమ్మరిగూడ, షాబాద్ గ్రామాల్లో చిన్నారులకు నులిపురుగు నివారణ మాత్రలు వేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. కేతన, అంగన్వాడీ టీచర్ ఇందిరమ్మ, ఆశవర్కర్ బుక్క యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : గట్టుఇప్పలపల్లి, తలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విదార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎంపీపీ నిర్మల, సర్పంచ్ లలిత విద్యార్థులకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకరయ్య, భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.
మొయినాబాద్ : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో చిలుకూరు రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ స్వరూప, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మోహన్శంకర్, డాక్టర్ వాణి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, కార్యదర్శి వెంకటేశ్, వార్డు సభ్యురాలు పద్మమ్మ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో నూలి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్‌గౌడ్, వైద్యాధికారి శ్వేత, వార్డు సభ్యుడు జీవన్‌కుమార్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను జడ్పీటీసీ అనురాధ, వైస్‌ఎంపీపీ అనంతరెడ్డి వేశారు. అనంతరం జాతీయ నులిపురుగుల దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. మున్సిపాలిటీలోని 8వ వార్డు అంగన్వాడీ కేంద్రం, సంకటోనిపల్లిలో గంథ్రాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ రాధమ్మ విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏఏంసీ డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, కౌన్సిలర్ యాదమ్మ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.