Kodangal | కొడంగల్, డిసెంబర్ 31 : సీఎం ఇలాకాలో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. చేతిపంపులు మరుగున పడడంతో ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డారు. మండలంలోని కొడంగల్, హస్నాబాద్, పర్సా పూర్, కొండారెడ్డిపల్లె, అంగడిరైచూర్, రుద్రారం తదితర గ్రామాల్లో గత మూడు నుంచి ఐదు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో నీరు ఎక్కడ వస్తే అక్కడికి పరుగులు తీస్తున్నారు.
ఇండ్లలో బోర్లున్న వారి ఇంటికెళ్లి నీటిని నింపుకొని కాలం వెల్లదీస్తున్నారు. మిషన్ భగీరథ నీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ఎండాకాలంలోనూ పుష్కలంగా నీరు వచ్చిందని పేర్కొంటున్నారు. తాము ఐదు రోజులుగా తాగునీటికి అవస్థలు పడుతుంటే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని మండిపడుతున్నారు.
ఈ విషయంపై మిషన్ భగీరథ పథకం అధికారుల వివరణ కోరగా.. ప్రస్తుతం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల పనులు జరుగుతున్నా యని.. తద్వారా పైప్లైన్లు పగిలి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రోడ్డు పనుల్లో పైపులైన్లు పగిలితే కాంట్రాక్టర్లు సరిగ్గా స్పందించడం లేదని.. విద్యుత్ శాఖ కూడా లైన్ షిప్టింగ్ అంటూ మూడు రోజులుగా ఉదయం నుంచి సాయంత్ర వరకు విద్యుత్తు సరఫరాను నిలిపేయ డంతో వాటర్ రాక..నీటి శుద్ధి జరుగక.. సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.