కులమత, పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామకాలనీలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మతవిద్వేషాలు రగిలించి రాజకీయంగా లబ్ధి పొందడం, నిత్యావసరాలు, చమురు ధరలు పెంచి ప్రజల జేబులు గుల్ల్ల చేయడంలో కేంద్ర సర్కార్ ముందున్నదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు, అర్థంలేని ఆందోళనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు పార్టీ నేతలు మంత్రికి ఘనస్వాగతం పలికారు.
అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ వైపు దేశం చూస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సుపరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగుపెడుతున్నాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులే పలుమార్లు ప్రస్తావించారన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Rr4
పహాడీషరీఫ్, మార్చి 29 : ‘ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతం.. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ అభిమతం.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దాం..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బుధవారం జల్పల్లి మున్సిపల్ పరిధి శ్రీరామకాలనీలోని విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, బీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
భారతమాత విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై సబితమ్మ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి గురుకులాలను నిర్మించడంతో పాటు ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరాయన్నారు. కార్పొరేట్ స్థాయికి దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సబ్బండ వర్గాలను ఆదుకుంటున్నదన్నారు. మోదీ ప్రభుత్వం పేదోడి కడుపుకొట్టి.. బడా బాబుల జేబులు నింపుతున్నదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సీఎంగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో అద్భుత పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కంటి వెలుగు వంటి గొప్ప కార్యక్రమంతో ఎంతో మందికి చూపు సమస్యలు తీరుతున్నాయన్నారు.
అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతోపాటు పలువురికి పింఛన్లు ఇస్తూ పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రం రాక ముందు రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ.2016కు పెంచారని గుర్తు చేశారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లలు అందజేయడంతో పాటు యాదవులకు గొర్రె పిల్లలను పంపిణీ చేస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తుండడం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా.. కంటి వెలుగులో చూపించుకుని అద్దాలు తెచ్చుకోవాలని ఎద్దేవ చేశారు. తాజాగా పథకం కింద ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నదన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు.
నియోజకవర్గంలో రెండు డివిజన్లు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు. అన్నింటిలో సమాన అభివృద్ధి చేస్తూ వెనుకబడిన జల్పల్లి మున్సిపాలిటీకి కొంచెం ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో జాప్యం చేయవద్దని కౌన్సిలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, శంకర్, భాషమ్మ, శంషొద్దీన్, నాయకులు జనార్దన్, నిరంజన్, ఖైసర్బాయ్, రాములు, సుభాష్ కుర్మ, దామోదర్‌రెడ్డి, కొండల్ యాదవ్, సాంబశివ, సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, పద్మ, యాస్మిన్ బేగం, ఫిరోజ్, బర్కత్ అలీ, మన్నన్ తదితరులు పాల్గొన్నారు.