రంగారెడ్డి, జూలై 27(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరద ఉధృతిపై గురువారం మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చెరువులు, కుంటలు నిండి అలుగు పారే ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు. అధికారులు 24 గంటలూ విధుల్లో ఉంటూ ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో బారి కేడ్లు, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నామని, ప్రజలు అధైర్యపడొద్దని చెప్పారు. అనంతరం మీర్‌పేటలోని మంత్రాల చెరువును పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, పాతభవనాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.