పరిగి, మార్చి 5 : రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగం అమలుకు బాబు జగ్జీవన్‌రామ్ రెండు కళ్లలా పనిచేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పరిగిలోని జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహనీయులు చూపిన దారిలో నడవడంతోపాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రత్యేక తెలంగాణ, జిల్లా లు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీల ఏర్పాటుకు పటిష్ట రాజ్యాంగం దోహదపడిందన్నారు. జగ్జీవన్‌రామ్ కూతురు కూడా క్రియాశీల రాజకీయాల్లో ముందుండడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి విద్యనందించాలని సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్యలో భాగంగా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం పనిచేసిన మహనీయులు చూపిన బాటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నడుస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. అమరవీరుల చౌరస్తాలోని జ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాల పక్కనే ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నివాళులర్పించినవారిలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ఎంపీపీలు అరవిందరావు, సత్యమ్మ, జడ్పీటీసీ హరిప్రియ, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.
మంత్రికి వినతిపత్రం
పరిగి టౌన్ : తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ సమగ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం పరిగి పర్యటనకు విచ్చేసిన మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్, సమగ్ర ఉద్యోగ సంఘం నాయకులు శ్రీశైలం, మోహన్ పాల్గొన్నారు.
దేశ చరిత్రలో చెరగని ముద్ర
వికారాబాద్ : మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని బీజేఆర్ చౌరస్తాలో సర్కారు నిర్వహిం చిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 116వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ తీశారు. మంత్రి సబితారెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహనీయుల సేవలను గుర్తిస్తూ.. వారిని స్మరించుకుంటూ.. అధికారికంగా జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి గొప్ప సంస్కర్తగా, రాజకీయవేత్తగా, పిన్న వయస్సులోనే చట్ట సభల్లో స్థానం కల్పించుకుని, వివిధ శాఖల్లో మంత్రిగా, ఉప ప్రధానిగా దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అంబేద్కర్ కాంస్య విగ్రహానికి సగం నెల జీతం విరాళం
వికారాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటులో భాగంగా తనవంతుగా నెల జీతం నుంచి సగం విరాళంగా అందించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఐలాండ్ నిర్మాణ పనుల నిమిత్తం సీబీఎఫ్ నుంచి రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, మాజీ మంత్రి చంద్రశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్‌కుమార్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీధర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖాధికారి కోఠాజీ, డీఆర్డీవో కృష్ణన్, ఆర్డీవో విజయకుమారి, డీపీవో తరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్, కార్యదర్శి నర్సింహులు, కమిటీ సలహాదారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.