రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 19న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రి సబితారెడ్డి సీఎంను కోరగా.. హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉంటూనే చదువుకునే అవకాశం కలిగింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు చేరువ కానున్నాయి. మంత్రికి సీఎం ఇచ్చిన హామీని 15 రోజుల్లోనే నెరవేర్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం తరఫున సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విప్లవమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పలుచోట్ల బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు
రంగారెడ్డి, జూలై 5(నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. జూన్ 19న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నపం మేరకు పదిహేను రోజుల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. 100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ దవాఖాన ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు జిల్లా ప్రజానీకం తరఫున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్స్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎంతో మేలు చేసే మెడికల్ కాలేజీని మంజూరు చేయడం పట్ల జిల్లా ప్రజానీకం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. కృతజ్ఞతగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు.
వైద్యానికి పెద్దపీట
రంగారెడ్డి జిల్లాలో వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది, ఈ క్రమంలోనే అనేక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు జిల్లా ప్రజానీకానికి ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. కొండాపూర్ దవాఖానను ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా వంద పడకల సామర్థ్యానికి పెంచింది. రెండు ఆక్సిజన్ ప్లాంట్లు, రెండు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, రెండు వెంటిలేటర్ల సదుపాయాన్ని ఇక్కడి దవాఖానలో కల్పించారు.
కరోనా వ్యాధి చికిత్సలకు సైతం 120 పడకల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలోనూ ఆక్సిజన్ ప్లాంట్లు, డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల దవాఖానలోనూ డయాలసిస్ సేవలు అందుతున్నాయి. గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానలో ఆధునిక హంగులతో 1200 పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందిస్తోంది. 59 బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాంతాల్లో తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 82 పల్లె దవాఖానలు విస్తృత సేవలు అందిస్తున్నాయి.
ఒకప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవేటుకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇది సామాన్య ప్రజానీకానికి పెనుభారంగా ఉండేది. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మొదలు.. పూర్తి స్థాయి వైద్యం పొందేందుకు ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండేది. ఈ పరిస్థితులకు నేడు ప్రభుత్వ దవాఖానలు చరమగీతం పాడుతున్నాయి. 24 గంటలూ ప్రభుత్వ దవాఖానల్లో సేవలు అందుబాటులో ఉంటుండడంతో ప్రసవం మొదలుకుని ఏ చిన్న రోగం వచ్చినా ప్రభుత్వ దవాఖానల వైపు చూసే పరిస్థితి నేడు అన్నివర్గాల ప్రజల్లోనూ కనబడుతున్నది. తాజాగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో చదువుకుంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి.