ఇబ్రహీంపట్నం, జనవరి 18 : కాంగ్రెస్ ప్రభు త్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు గు ర్తుచేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను మహిళల పేర్లమీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా మెట్రో, ఆటో లు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగిందని జరుగుతున్న ప్రచారం తప్పన్నారు. ఆటోయూనియన్లతో చర్చలు జరుపుతున్నామని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల దృష్ట్యా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నేటి నుంచి రోడ్డు భద్రతా కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. గతేడాది రాష్ట్రంలో 22 వేల రోడ్డు ప్రమాదాలు జరుగగా సుమారు 3 వేల మందికి పైగా మృతిచెందగా వేలాది మం ది క్షతగాత్రులయ్యారన్నారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రాంతీయ కార్యాలయంలో మరిన్ని సేవలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమన్నారు. రామోజీ ఫౌండేషన్ రూ.2.15 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించి ఇవ్వటాన్ని ఆయన స్వాగతించారు. సాగర్ రహదారి నుంచి ఆర్టీఏ కార్యాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ప్రాంతం లో త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. సాగర్ రహదారి నుంచి ఆర్టీఏ కార్యాలయానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ శశాంక తెలిపారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, ఎగ్గె మల్లేషం, రామోజీ ఫౌండేషన్ ఎండీ విజయేశ్వరి, తుర్కయంజాల్ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, కాం గ్రెస్పార్టీ నాయకుడు మల్రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, అబ్దుల్లాపూర్‌మెట్ జడ్పీటీసీ దాసు, నాయకులు గురునాథ్‌రెడ్డి, మధు, మున్సిపల్ వైస్‌చైర్మన్ హరిత, ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాస్‌రాజు, ఇబ్రహీంపట్నం ఆర్టీవో రఘునందన్‌గౌడ్, రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.