వికారాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో కలిసి 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో జిల్లా కేంద్రమంతా గులాబీమయమైంది.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు ఎన్నో ఏండ్లుగా ప్రజలు కోరుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ మెడికల్ కాలేజీలుండేవి, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం సంతోషమని, గ్రామీణ ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగుపడనున్నాయని మంత్రి వెల్లడించారు. 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గతంలో ఐదే మెడికల్ కాలేజీలుండేవి, ఐదింటిలో కూడా గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలు స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉండగా, 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కేవలం రెండు మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేసిందన్నారు. ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో 26 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, మంచి మనసున్న నాయకుడన్నారు. జిల్లా ఏర్పాటుతోపాటు వికారాబాద్‌కు డిగ్రీ కాలేజీతోపాటు మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ సహకారంతో తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్‌కు లీడర్ లేరు, రెండున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్‌కుమార్ గౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించడం దేశ వైద్యరంగ చరిత్రలోనే ప్రథమమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నగరంలోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయాలన్న ప్రధాన లక్ష్యంతో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నదని, ఇతర రాష్ర్టాలకు ధీటుగా తెలంగాణలో వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది నాటికి మరో ఎనిమిది కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కేంద్రం సహకరించకున్నప్పటికీ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వికారాబాద్‌లో కళాశాలను ప్రారంభం చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలో మహేశ్వరం, మేడ్చల్‌లో కొత్త వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు.