బీఆర్ఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. శనివారం పరిగిలోని ఆయన నివాసంలో హరీశ్వర్‌రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా ఆఖరి చూపు కోసం నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన తనయులు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అనిల్రెడ్డిలను మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. సాయంత్రం వేలాది మంది అభిమానులు, వివిధ కళాశాలల విద్యార్థుల అశ్రునయనాల మధ్య హరీశ్వర్‌రెడ్డి అంతిమయాత్ర కొనసాగగా, అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హరీశ్వర్‌రెడ్డి మృతికి సంతాపంగా పరిగిలోని పలు విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
పరిగి, సెప్టెంబర్ 23 : బీఆర్ఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం పరిగిలో వేలాది అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల నాయకులు హరీశ్వర్‌రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జి.రంజిత్‌రెడ్డి, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, కొడంగల్, తాండూరు, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పి.నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జడ్పీ చైర్పర్సన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, టి.రాంమోహన్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బి.విజయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బీజేపీ నాయకులు బూనేటి కిరణ్, కరణం ప్రహ్లాదరావులు హరీశ్వర్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు.
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అనిల్రెడ్డిలను కేటీఆర్ ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్వర్‌రెడ్డి సతీమణి గిరిజాదేవిని మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, గతంలో పరిగి ప్రాంతంలో వివిధ శాఖలలో పని చేసిన అధికారులు హరీశ్వర్‌రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
వార్డుడ మెంబర్ నుంచి.. డిప్యూటీస్పీకర్..
బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని వార్డు మెంబర్ నుంచి ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వరకు పని చేశారు. 1947 మార్చి 18వ తేదీన జన్మించిన హరీశ్వర్‌రెడ్డి పదో తరగతి వరకు చదువుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి పరిగిలో 1972లో వార్డు సభ్యుడిగా గెలుపొంది 1977 వరకు ఉపసర్పంచ్‌గా పని చేశారు. 1977 నుంచి 1983 వరకు సర్పంచ్‌తోపాటు సమితి వైస్ చైర్మన్‌గా పని చేశారు. 1983లో పరిగి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్వర్‌రెడ్డి 56 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009లలో ఐదు పర్యాయాలు పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1986 నుంచి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా, 1988-1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పని చేశారు. 1997 నుంచి 2003 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్‌గా, 2001 డిసెంబర్ 31 నుంచి 2003 నవంబర్ 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న హరీశ్వర్‌రెడ్డి 2012 నవంబర్ 15వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు కొప్పుల మహేశ్‌రెడ్డి, కొప్పుల అనిల్‌రెడ్డి, కూతురు అర్చనారెడ్డిలు ఉన్నారు. పెద్ద కుమారుడు కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు
శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో హరీశ్వర్‌రెడ్డి మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరిగికి చేరుకొని నివాళులర్పించారు. శనివారం ఉదయం నుంచి హరీశ్వర్‌రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, తెల్లవారుజాము నుంచి మొదలుకొని సాయంత్రం నాలుగు గంటలు అంతిమయాత్ర ప్రారంభమయ్యే సమయం వరకు పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు సైతం హరీశ్వర్‌రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. వేలాది మంది అభిమానులు, వివిధ కళాశాలల విద్యార్థులు అశ్రునయనాల మధ్య శ్రద్దాంజలి ఘటించారు. హరీశ్వర్‌రెడ్డి మృతికి సంతాప సూచకంగా పరిగిలోని పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుంచి డప్పులతో హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
ప్రభుత్వ అధికారిక లాంభలతో అంత్యక్రియలు..
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనలతో నిర్వహించారు. పరిగిలోని స్వగృహం నుంచి బహార్‌పేట్ మీదుగా మెయిన్‌రోడ్డు, కొడంగల్ చౌరస్తా నుంచి పల్లవి విద్యా సంస్థల వరకు వేలాది మందితో హరీశ్వర్‌రెడ్డి అంతిమయాత్ర కొనసాగింది. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి వందనం చేశారు. అనంతరం పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు.