ఇబ్రహీంపట్నం, జనవరి 21 : రంగారెడ్డి జిల్లాలో పలువురు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లపై పెట్టిన అవిశ్వాసాలు గట్టెక్కేనా అని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, బండ్ల గూడ మున్సిపల్ చైర్పర్సన్లతోపాటు ఆదిబట్ల వైస్ చైర్‌పర్సన్‌పై ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. కాగా వారిని మున్సిపల్ చైర్పర్సన్ పదవి రేసులో ఉన్న వారు క్యాంపులకు తీసుకెళ్లారు.
అవిశ్వాస తీర్మానాలపై 30 రోజుల్లోపు కలెక్టర్ నిర్ణయం తీసుకుని గడువు ఇవ్వాల్సి ఉన్నది. కానీ.. ఆయన గడువు ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం పెడుతూ కౌన్సిలర్లు కలెక్టర్‌కు దరఖాస్తు చేసి సుమారు నెలరోజులు కావొస్తున్నది. అందువల్ల ఈ మున్సిపాలిటీల చైర్పర్సన్లపై అవిశ్వాస గడువు వ స్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
మరోవైపు అధికార కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్లలో కొంతమంది ఆ పార్టీ చైర్పర్సన్పైనే అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్లో ఉండి.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలంటూ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కలెక్టర్‌ను కోరారు. దీంతో ఏ ఒక్కరికీ అవిశ్వాసంపై గడువు ఇచ్చినా…మిగతా వారికీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ను ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లున్నారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి, అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్లో చేరిన కొత్త ఆర్తికగౌడ్ ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని అధిష్ఠించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ మున్సిపల్ చైర్మన్ పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన ఆదిబట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ మర్రి నిరంజన్‌రెడ్డి ఇదే అవకాశాన్ని వాడుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఒత్తిడి చేయించి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిబట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి కలెక్టర్ అనుమతిస్తే ఇబ్రహీంపట్నం, బండ్లగూడ మున్సిపల్ చైర్పర్సన్లపైనా అవిశ్వాసానికి అనుమతి వస్తుందని కౌన్సిలర్లు భావిస్తున్నారు. మూడు మున్సిపాలిటీల అవిశ్వాస తీర్మానాలపై గడువు వస్తే మరికొన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్చైర్మన్లపైనా అవిశ్వాసాలు పెట్టాలనే ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నారు.