రంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ)/వికారాబాద్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ముందస్తుగానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు వాటి తరలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా అదనంగా 400 కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తేమ కలిగిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల పాలక వర్గాల తోడ్పాటుతోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను కొనుగోలు చేయడం సాధ్యపడిందని, మంత్రి వారిని అభినందించారు.
60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ అనంతరం రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 3528.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా చూస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, డీసీఎస్వో మనోహర్ రాథోడ్, జిల్లా సహకార సంస్థ అధికారి ధాత్రి దేవి, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం శ్యామారాణి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టర్ హరీశ్
ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి..
మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ అనంతరం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కనీసం మూడు చొప్పున తూకం యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అనుగుణంగా ప్రతి రోజు కనీసం 320 ట్రాన్స్పోర్ట్ వాహనాలను వినియోగించాలని, 15 రోజుల పాటు జిల్లాలోని అన్ని ట్రాన్స్పోర్ట్ వాహనాలను సమకూర్చుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్రెడ్డివెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి