కేశంపేట, మే 11: ఆలయం సమీపంలో అనుమానాస్పద స్థితిలో తవ్వకాలు జరిపిన ఘటన కేశంపేట మండల పరిధిలోని వేముల్ నర్వ గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గత 40ఏళ్ల క్రితం గ్రామంలోని కొందరికి గత్తర(గాలి వంటి మహమ్మారి) సోకడంతో కాపాడాలని వేడుకుంటూ కొందరు బీరప్ప ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆలయం సమీపంలో కొల్లూరి బుచ్చయ్య కుటుంబానికి చెందిన వ్యవసాయ పొలంలో ఓ పెద్ద బండరాయి ఉందని, ఆలయం నిర్మించిన సమయంలో బండరాయి కింద ఏమైనా గుప్త నిధులు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిపి ఉంటారని, తవ్వకాల్లో మట్టి కుండలు బయటపడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన స్థలంలో జేసీబీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఆలయానికి వెళ్లే దారిలో ఏదైనా జేసీబీ వెళ్లిందా అనే కోణంలో గత మూడు, నాలుగు రోజులకు సంబంధించిన సీసీ పుటేజీని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.