రంగారెడ్డి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ మెనూ చార్జీలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కార్మికులు తరలివచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవాలని కార్మికులంతా ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి అప్పటికే కలెక్టర్ కారు వెళ్లిపోవడంతో గేటు వద్ద అడ్డుగా కూర్చుని నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలోపలికి వచ్చే వాహనాలు, బయటకు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి అరగంట వరకు రాకపోకలు స్తంభించాయి.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు యెలమోని స్వప్న మాట్లాడుతూ మెనూ చార్జీలతోపాటు కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. నెలల తరబడిగా బిల్లులు రాకపోవడంతో ఎదురు పెట్టుబడి పెట్టి విద్యార్థుల కడుపులు నింపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గుడ్ల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్తో వారానికి మూడు గుడ్లు ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో వారం రోజుల తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెట్టి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు డి.కిషన్, పోచమోని కృష్ణ, ఇ.నర్సింహ, బట్టి బాలరాజు, శ్రీను, మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అలివేలు, ఉపాధ్యక్షురాలు గణేశ్, కోశాధికారి సరిత, జిల్లా నాయకులు శిరీష, పద్మ, లక్ష్మమ్మ, లక్ష్మి, భాస్కర్, శ్రీలత, రమాదేవి, మల్లారి నవనీత తదితరులు పాల్గొన్నారు.