కడ్తాల్, జూలై 15 : మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జీతాలు అందక, భోజనం బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కార్మికులు అప్పులు చేసి విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు, మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మమ్మ, గ్రామ అధ్యక్షురాలు వరలక్ష్మి, సభ్యులు బుజ్జమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.
మంచాల : మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ అన్నారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సీఐటీయూ మండల నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు తొమ్మిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సరిత, జంగమ్మ, అలివేలు, యాదమ్మ పాల్గొన్నారు.