బంట్వారం, ఏప్రిల్ 19 : అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులకు.. తాము పవర్లోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు. శనివారం కోట్పల్లి మండలంలోని కరీంపూర్ వద్ద ఆయన అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో పోస్టులు తీసుకోవడం కాదు.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని.. లేకుంటే అవి ఊడుతాయని హెచ్చరించారు. మండలంలోని కార్యకర్తలు పార్టీ ఆదేశాలను అనుసరించాలని, రానున్నది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నేడు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, అబద్ధపు హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని పేర్కొన్నారు.
అక్కడక్కడ కొందరు అధికారులు పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ కార్యకర్తలను వేధించిన వారికి తాము అధికారంలోకి రాగానే మిత్తీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. అధికారులు, పోలీసులు చట్టాల ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా పార్టీ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆయన ప్రకటించారు. అధ్యక్షుడిగా సుందరి అనిల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బాబు, బీసీ సెల్ అధ్యక్షుడిగా గొడ్డలి మల్లయ్య, సోషల్ మీడియా ఇన్చార్జిగా ప్రవీణ్లను ఎన్నుకున్నారు.