ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతుండగా, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మూసీ, కాగ్నా నదులు ఉధృతంగా పరవళ్లు తొక్కుతున్నాయి. కోట్‌పల్లి, లాక్నాపూర్, జంటుపల్లి ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా కోట్‌పల్లి మండలంలో 9.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శంషాబాద్‌లో 7.0మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్, జూలై 25, (నమస్తే తెలంగాణ): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగ్నా వరద ప్రవాహంతో పలు గ్రామాలకు మంగళవారం మధ్యాహ్నం వరకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి ప్రాజెక్టులు నిండుకుండలా మారి అలుగుపారుతున్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే జిల్లాలో అత్యధికంగా కోట్‌పల్లి మండలంలో 9.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ మండలంలో 6.3 సెం.మీటర్లు, పూడూర్లో 5.5, ధారూర్‌లో 5.2, మర్పల్లిలో 4.8, నవాబుపేటలో 4.8, పరిగిలో 4.3, పెద్దేముల్లో 4.2, తాండూరులో 3.8, బషీరాబాద్‌లో 3.4, కుల్కచర్లలో 3.3, దోమలో 3.1, యాలాలలో 2.8, చౌడాపూర్‌లో 2.7, బొంరాస్‌పేటలో 2.2, దౌల్తాబాద్‌లో 2.1, దుద్యాల మండలంలో 2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
నిండిన జలాశయాలు
వికారాబాద్ : గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వికారాబాద్ పట్టణం, మండల పరిధిలోని ఆయా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివసాగర్ చెరువు, మండల పరిధిలోని సర్పన్‌పల్లి చెరువులు, పలు కుంటలు వరద నీటితో నిండి కళకళలాడుతున్నాయి. సోమవారం రాత్రి భారీ వర్షం కురియడంతో మంగళవారం చెరువులు, ప్రాజెక్టులు నిండి అలుగు పారుతున్నాయి. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు వరద నీరు ఎక్కువగా ప్రవహిస్త్తుండడంతో ప్రజలు ఎవరూ ఇండ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరూ ఉండరాదని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
అలుగు పారుతున్న లక్నాపూర్ ప్రాజెక్టు
పరిగి : మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల తో మంగళవారం తెల్లవారుజాము నుంచి లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు పారుతున్నది. లక్నాపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 18 అడుగుల వరకు ఉంటుంది. సోమవారం వరకు 16 అడుగుల వరకు నీరు చేరగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రాజెక్టు నీటితో నిండి అలుగు పారుతున్నది. ప్రాజెక్టు అలుగు పారడంతో పరిగితోపాటు పలు గ్రామాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండడంతో దాదాపు 2,400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనున్నది. అలాగే మండలంలోని ఇతర చెరువులలోకి సైతం పెద్ద ఎత్తున నీరు చేరుకున్నది.
నిండిన చెరువులు.. ఆనందంలో రైతులు
బొంరాస్‌పేట : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. చెరువులు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురువడంతో పుష్కలంగా వానాకాలం పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందంగా ఉన్నారు. మండలంలో 13 నోటిఫైడ్ చెరువులు ఉండ గా భారీ వర్షాలకు ఇప్పటికే ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు, బురాన్‌పూర్ చిన్నవాగు ప్రాజెక్టు నిండాయి. మంగళవారం మెట్లకుంట ఎల్లమ్మ చెరువు, బురాన్‌పూర్ పెద్ద చెరువు నిండి అలుగు పారుతున్నాయి. చెరువుల కింద వానాకాలంలో వరినాట్లు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. బురాన్‌పూర్ పెద్ద చెరువు అలుగు నుంచి వచ్చే వరద నీరు వల్ల బురాన్‌పూర్-మదన్‌పల్లి మధ్య వంతెన తెగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెనను శాశ్వతంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. బొంరాస్‌పేట పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చే ఏటి కాల్వకు గండి పడడంతో రైతులు పూడ్చారు.
దంచి కొట్టిన వాన
ధారూరు : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. ఈ ప్రాజెక్టు అలుగు పొంగి పొర్లడంతో ధారూరు-నాగసముందర్ మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలచిపోయాయి. భారీ వర్షానికి మండల పరిధిలోని దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా)వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో దోర్నాల్- ధారూరు స్టేషన్ మధ్య ఉన్న తాత్కాలిక వాగు వంతెన దెబ్బతిన్నది. దోర్నాల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, దోర్నాల్ తండా, ధారూరు-నాగసముందర్ మధ్య వాగు వంతెనపై నీరు పారుతుండడంతో నాగసముందర్, అల్లాపూర్ తదితర గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధారూరు పోలీసులు ఈ రూట్‌టలో రాకపోకలను నిలిపివేశారు. కురిసిన వర్షానికి మండ ల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు కుం టల్లో భారీగా నీరు చేరి రోడ్లు దెబ్బతిన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నీటి తో నిండిపోయాయి.
ఈసీ వాగులోకి భారీగా వరద నీరు
మొయినాబాద్ : ఈసీ నది ఎగువ ప్రాంతంలోని షాబాద్, పూడూరు, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో సోమవారం రాత్రి భారీగా కురిసన వర్షానికి ఈసీ నదిలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న ఈసీ నదిలోని వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. మంగళవారం ఉదయం వాగు ఉధృతంగా పారుతుండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న పంటలు నీట మునిగాయి.
మాసబ్ చెరువుకు జలకళ
తుర్కయాంజాల్ : ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరు వు జలకళను సంతరించుకొని నిండుకుండను తలపిస్తున్నది. చెరువులో ఇప్పటికే నీరు ఉన్నప్పటికీ కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో అలుగు పారుతున్నది. దీంతో అలుగు వద్ద కొందరు చేపలను పడుతున్నారు.
నిండు కుండలా మూసీ వాగు
శంకర్పల్లి : మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వర్షాలు విస్తారంగా పడుతుండడంతో వికారాబాద్ నుంచి గండిపేట వరకు ఉన్న మూసీ వాగు నిండుకుండలా ప్రవహిస్తున్నది. వాగుల వద్ద సెల్ఫీలు దిగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.