జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ (Sankranthi festival ) సందర్భంగా మహిళ పోలీసు వేసిన ప్రత్యేక సందేశాత్మక రంగవల్లి (ముగ్గు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ ఆర్. వనజ రంగురంగుల ముగ్గులతో పోలీసుల విధులు, ప్రజలకు పలు రకాల సూచనలతో అందంగా వేసిన ముగ్గు పలువురి ప్రశంశాలను అందుకుంది.

తెలంగాణ పోలీస్ లోగో ( Police Logo ) తో అందంగా రూపొందించిన ముగ్గులో హెల్మెట్ ను ధరించి ప్రాణాలు తప్పించుకో.. చైనా మాంజ ప్రాణాలకు ముప్పు.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. సిగ్నల్ పాటించండి సురక్షితంగా చేరుకోండి అంటూ నినాదాలు వేశారు. ఫ్రాడ్ కాల్స్. పుల్‌స్టాప్, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు, పోలీసు హోదా చిన్నది బాధ్యత పెద్దది, సత్యమేవ జయతే అంటూ వేసిన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఎస్సై కాశీనాథ్ తో పాటు పోలీస్ సిబ్బంది మహిళ కానిస్టేబుల్‌ను అభినందించారు. ముగ్గు ద్వారా పోలీసుల బాధ్యతలు, విధులతోపాటు సామాజిక సందేశాన్ని ప్రజలకు చాటగలడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మహిళా కానిస్టేబుల్ వనజ పేర్కొన్నారు .