షాబాద్, జూన్ 6: బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని షాబాద్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, వసంతయామిని అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. శంకర్పల్లి మండలం సంకెపల్లి గ్రామంలో హెచ్ఎం సులోచన, పంచాయతీ కార్యదర్శి నరహరి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఎల్.నర్సింహులు, డేవిడ్‌రెడ్డి, ఆంజనేయులు, మల్లికార్జున్, హన్మంత్, వెంకటేశం, నాగయ్య, క్లస్టర్ సీఆర్పీ లింగం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం వర్కాల పరమేశ్ అన్నారు. ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పాఠశాల స్థాయి సమావేశం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బుచ్చయ్య, అశోక్, రామ్మోహన్, జంగయ్య, విజయలక్ష్మి, ఇందిరాదేవి, చైర్మన్ మమత, వివో సభ్యులు మాధురి, అంగన్వాడీ టీచర్లు బేబీ, సుజాత పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంపీడీవో క్రాంతికిరణ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం హెచ్ఎం శ్రీనివాస్‌తో కలిసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకట్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, ఉన్నత పాఠశాల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు లావ ణ్య, పద్మ, అంగన్వాడీ టీచర్లు సరస్వతి, భారతమ్మ, శివరాణి పాల్గొన్నారు.
చేవెళ్లరూరల్ : బడీడు పిల్లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్షరాస్యత పెంపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అంతారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామారావు అన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం చేవెళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైంది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శుభ్రత, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ తదితర వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరిగి మల్లేష్ కుమార్, మాణిక్యరావు, నర్సింహులు, హని, ఉష, రేష్మ, సరిత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపాధ్యాయులు అన్నా రు. ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమా న్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వారి ఉజ్వల భవిష్యత్‌కు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారన్నారు.
తుర్కయంజాల్ : పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కొహెడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుపతి భాయి అన్నారు. మున్సిపాలిటీ పరిధి కొహెడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో అమ్మఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యాయులు దన్నెరాజు, జగన్రాజు, నరసింహ, లక్ష్మణ్, గోపాల్‌రెడ్డి, రాధామాధవి, కొండయ్య, మంజుల, కృష్ణకుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.
యాచారం : గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ప్రతి విద్యార్థి బడిలో ఉండే విధంగా చర్యలు చేపడుదామని మండల అభివృద్ధి అధికారి సంధ్య అన్నారు. బడి బాట కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. నాగిరెడ్డిగూడ గ్రామంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాలను అక్షరాస్యత గ్రామాలుగా మార్చడం కోసం ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతూ అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అనంతరం తమ పాఠశాలలో గతంలో సాధించిన ఫలితాల కరపత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తూ ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మంచాల : వివిధ గ్రామాల్లో ఇన్చార్జి ఎంఈవో వెంకట్‌రెడ్డి బడిబాట ర్యాలీని ప్రారంభించారు. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించడమే లక్ష్యమని అనాజ్‌పూర్ ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కరుణ అన్నారు. మండలంలోని అనాజ్‌పూర్, కొత్తగూడంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విష్ణువర్ధన్‌రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్, పుల్లారెడ్డి, కిషోర్‌కుమార్, కమలకుమారి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.