కొడంగల్ : పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అమ్మా ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులుకు సూచించారు. శనివారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలో నెలకొన్న మరమ్మతులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల తరగతి గదుల్లో కిటికీలు, కరెంటు, తాగునీటి వంటి పలు అంశాలకు సంబంధించి కమిటీ ఆధ్వర్యంలో రూ.25వేల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉందన్నారు.
రూ.25వేల బడ్జెట్ దాటితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వెల్లడించారు. ప్రస్తుతం పాఠశాలల్లో నెలకొన్న అత్యవసర సౌకర్యాలను గుర్తించి జాబితా సిబ్బంది చేయాలని సూచించారు. జాబితా మేరకు ఖాతాల్లో నిధులు జమ కాగానే పనులు చేపట్టుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషక్ష, మున్సిపల్ కమిషన్ బలరాంనాయక్, కార్యక్రమ ప్రత్యేకాధికారి సత్యనారారణతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పూడూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక వసతులపై నూతన పాఠశాల కమిటీ చైర్మన్లు దృష్టి సారించాలని ఎంపీడీవో పాండు, మండల విద్యాధికారి హరిశ్చంద్ర తెలిపారు. శనివారం పూడూరు మండల కేంద్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో పాఠశాల గదుల మరమ్మతులు, తాగునీటి, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తుందన్నారు.
ఈ నిధుల ద్వారా పాఠశాల చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు కలిసి త్వరగా పనులు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుధారాణి, ఏపీఎం బందయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, కాంప్లెక్స్ హెచ్ఎం రత్న, చంద్రశేఖర్, ఎంఎన్వో వెంకటేశం, సీఆర్పీలు జంగయ్య, గాలయ్య, ఎంఆర్సీ రాఘవేందర్ పాల్గొన్నారు.
బొంరాస్పేట : ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కమిటీలు చేయవలసిన పనుల గురించి ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీదేవి, జీహెచ్ఎం హరిలాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని కమిటీ సభ్యులు తెలిపారు.
అనంతరం పాఠశాలల్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటికి తీర్మానాలు సేకరించారు. అనంతరం ఎంపీడీవో శ్రీదేవి మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఉపాధ్యాయులు చూసుకోవాలని సూచించారు. సమావేశంలో డీటీ రవికుమార్, పాఠశాలల హెచ్ఎంలు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు పాల్గొన్నారు.
కులకచర్ల : పాఠశాలల అభివృద్ధికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనిచేయాలని కులకచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తెలిపారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సంఘం అధ్యక్షులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి వారి పేర ఖాతాలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభించే వరకు ప్రతి పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కులకచర్ల మండల ప్రత్యేక అధికారి సరళదేవి, ఎంఈవో అబీబ్హైమద్, ఏపీఎం శోభ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సంఘాల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు.