కేశంపేట, మే 20 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని మండల విద్యాధికారి చంద్రశేఖర్ సూచించారు. కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఎంఈవో ప్రారంభించి మాట్లాడారు. మండలం నుంచి 8మంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఈ నెల 13 నుంచి 17వరకు శిక్షణ తీసుకున్నారని, శిక్షణ పొందినవారు మండలంలోని 40 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 80మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారన్నారు. పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు 1, 2వ తరగతిలోనే రాయడం, చదవడం వచ్చేలా వారం రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు.
శిక్షణ అనంతరం ప్రతి ఉపాధ్యాయుడు గ్రామాల్లోని తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోగల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు రామకృష్ణయ్య, మల్లయ్య, మల్లేశ్, కంప్యూటర్ ఆపరేటర్ ఏలియన్, తదితరులు పాల్గొన్నారు.