చేవెళ్ల టౌన్, జూన్ 9 : చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాల్సి ఉండగా కళాశాల యజమాన్యం మాత్రం ఇవ్వడం లేదని, కానీ మేనేజ్మెంట్ మాత్రం మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి అదనంగా ఆరు లక్షలు కడితేనే మీకు ఫుల్ స్టైఫండ్ ఇస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎలాగైతే పీజీ స్టూడెంట్స్కు స్టైఫండ్ ఇస్తున్నారో అలాగే ప్రయివేట్ మెడికల్ కళాశాలలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం జీవోను తెచ్చిందని కానీ ఆ జీవోను పక్కన పెట్టి మాకు ఎలాంటి స్టైఫండ్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ మెడికల్ కళాశాల విద్యార్థులకు స్టైఫండ్ అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు.