షాబాద్, మార్చి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం రంగారెడ్డి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ప్రజల కంటి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా కంటి అద్దాలతో పాటు, మందులు అందజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప పరిణామమని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ప్రజలు చెబుతున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 15,378 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,635 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,284 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 5,521 మందికి కంటి పరీక్షలు
బొంరాస్‌పేట : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. సోమవారం జిల్లాలో 5521 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 804 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 724 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 189 గ్రామాలు, 42 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్ తెలిపారు. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు.
అద్దాలు తీసుకున్నా..
కంటి చూపు సమస్యలు ఉన్న పేదలకు దూర భారం కాకుండా సొంత గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేసి మందులు అద్దాలు ఇవ్వడం గొప్ప విషయం. రాష్ట్ర ఫ్రభుత్వం పేదల కోసం ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టడం సీఎం కేసీఆర్ గొప్ప మనస్సుకు నిదర్శనం. నేను పరీక్షలు చేయించుకొని మందులు, అద్దాలు తీసుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది.
– ఎండీ.అహ్మద్ ఖాన్, తల్లారం గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
ఉచితంగానే కండ్లద్దాలు
సర్కారోళ్లు ఉచితంగా కంటి పరీక్ష లు చేసి కండ్లద్దాలు ఇచ్చారు. డాక్ట ర్లు మంచిగా చూశారు. దగ్గరున్న వస్తువులను చూడమన్నారు. అద్దాలు పెట్టుకొని చూస్తే మంచిగా కనిపించాయి. సీఎం కేసీఆర్ పేదలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉచితంగా పరీక్షలు చేయించి అద్దాలు ఇప్పించడం చాలా సంతోషంగా ఉన్నది. కంటి సమస్యలున్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలి.
– సామ్రాజ్యం, పెద్దఅంబర్‌పేట