ఇబ్రహీంపట్నం, జనవరి 19 : రంగారెడ్డిజిల్లాకు త్వరలో మెడికల్ కళాశాల, యూనివర్సిటీ రానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో జరిగిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు మెడికల్ కళాశాల త్వరలో మంజూరు కానుందని అన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా మరో యూనివర్సిటీ కూడా రానుందని తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డిజిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో జిల్లా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. దీని ఫలితంగా జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. మారుమూల ప్రాంతంలో కూడా ఎకరాకు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నదని తెలిపారు. ప్రణాళికబద్దంగా జిల్లాను అభివృద్ధిపరంగా ముందుకు తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఐటీ రంగం అభివృద్ధితోపాటు పెద్దఎత్తున పరిశ్రమలు కూడా వస్తున్నాయని.. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో జిల్లా స్వరూపమే మారబోతుందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రమేశ్‌గౌడ్, రమేశ్, బుగ్గ రాములు, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు జంగయ్య, వెంకట్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పుల్లారెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, వ్యవసాయశాఖ డివిజన్ అధికారి సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు రాజు, విజయ్, ప్రేమ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మన్ రవిందర్‌రెడ్డి, డైరెక్టర్లు జానీపాషా, పావని, నారి యాదయ్య, శంకర్‌నాయక్, తలారి మల్లేశ్, శ్రీనివాస్, కిరణప్ప, మంగ వెంకటేశ్, ఆడాల గణేశ్, బుట్టి రాములు, నర్సింహారెడ్డి తదితరులతో జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను పలువురు అభినందించారు.
సీఎం కేసీఆర్ రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని మంత్రి అన్నారు. వ్యవసాయం దండుగ అనుకున్న పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా తయారుచేశారని పేర్కొన్నారు. గతంలో ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల కొరత రైతులను వేధించేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. రైతు బంధు కింద ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికే రూ.513 కోట్లు, రూ.33 కోట్లు రైతు బీమా కింద వచ్చాయని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి అందిస్తున్న తోడ్పాటుతో వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాల్లో ఉంటున్నవారు కూడా సెలవు రోజుల్లో గ్రామాలకు వచ్చి వ్యవసాయాన్ని చూసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం గ్రామాలకు వచ్చి ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలను అందిపుచ్చుకుని వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి రైతుల సమస్యలను తీర్చాలని, ప్రభుత్వపరంగా తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పాలకవర్గాలు పదవులను అలంకారప్రాయంగా చూసుకోకుండా రైతుల కోసం పనిచేసి వారి మనసులను చూరగొనాలని మంత్రి సూచించారు.
నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి రైతుల మన్ననలు పొందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎంతో నమ్మకంతో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు అన్ని వర్గాల వారికి అందించడం జరిగిందని తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గం మార్కెట్ అభివృద్ధితో పాటు రైతుల సమస్యలపై నిరంతరం పనిచేయాలన్నారు. మార్కెటింగ్‌శాఖ, వ్యవసాయశాఖతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకు ప్రభుత్వం రూ.12కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే మంత్రి కేటీఆర్ ఈ పనులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మంగల్‌పల్లి గేటువద్ద త్వరలోనే కూరగాయల స్టాక్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెరుగుతున్న రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం త్వరలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీకి మరో 15 ఎకరాల భూమిని తీసుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ఇబ్రహీంపట్నం అభివృద్ధి కోసం పాటుపడే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అండదండలతో పాలకవర్గం మార్కెట్ అభివృద్ధితోపాటు రైతుల అవసరాల కోసం పనిచేయాలన్నారు.