శామీర్‌పేట, జూలై 7 : భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..శామీర్‌పేటకు చెందిన బొసాల నరసింహ(26) డ్రైవర్ వృత్తి నిర్వహిస్తున్నాడు. ఎనిమిది నెలల కింద వివాహం జరిగింది. భార్య ప్రస్తుతం గర్భిణి. వృత్తిలో భాగంగా కొద్ది రోజుల కిందట నరసింహ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లగా అతని భార్య అమీర్‌పేట్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన నరసింహ తన భార్యకు ఫోన్ చేసి తిరిగి రావాలని కోరాడు.
ఇందుకు ఆమె మద్యం సేవించడం మానితే వస్తానని చెప్పింది. ఈ విషయమై కొద్దిసేపు ఫోన్లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నరసింహ ఫోన్ కాల్స్‌కి స్పందించలేదు. దీంతో మనస్థాపానికి గురై ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తన బంధువు తిమ్మయ్య నరసింహ ఇంటికి రాగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. వెంటిలేటర్ గుండా చూడగా చూరుకు వేలాడుతూ కన్పించారు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. నరసింహ భార్య పూజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.