బొల్లారం,జూలై 19 : ఆన్లైన్ గేమ్‌కు బానిసై ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంథోనమ్మ తెలిపిన వివరాల ప్రకారం..లాల్ బజార్ ప్రాంతానికి చెందిన మణికంఠ(22) ప్రైవేటు ఉద్యోగి. ఆన్లైన్ గేమింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోయి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు .యువకుడు ఆత్మహత్యకు గేమింగ్ యాప్‌లలో జరిగినా ఆర్థిక నష్టమే కారణమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలపై విచారణ చేపడుతున్నారు.