అల్లాపూర్,ఏప్రిల్24: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో లోప్రెషర్ కారణంగా సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు పెద్ద ఎత్తున వార్డు కార్యాలయానికి వచ్చి కార్పొరేటర్ సబిహ బేగం వద్ద తమ గోడును వెళ్లబుచ్చారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, మరోవైపు లో ప్రెషర్ తో 20 నుండి 30 నిమిషాలు మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారన్నారన్నారు. దీంతో రూ. వేలు వెచ్చించి వాటర్ క్యాన్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని మహిళలు వాపోయారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గంటకు పైగా తాగునీరు సరఫరా అయ్యేదని, మాయదారి కాంగ్రెస్ పాలనలో నల్ల ఎప్పుడు వస్తుందో కళ్లలో ఒత్తులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. పర్వత్ నగర్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కార్పొరేటర్ ను అభ్యర్థించారు. వారి సమస్య విన్న కార్పొరేటర్ స్పందించి జలమండలి అధికారులకు ఫోన్ చేసి పర్వత్ నగర్ లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.