దుండిగల్, జూన్ 4: హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సూట్‌కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఐ ఉపేందర్ తెలిపిన వివలా ప్రకారం.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడను అనుకొని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్‌లో నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సూట్‌కేసును పరిశీలించారు. అనంతరం దాన్ని తెరవగా అందులో కుళ్లిన స్థితిలో మహిళా మృతదేహం కనిపించింది.
చనిపోయిన మహిళ 25 నుంచి 35 ఏళ్ల వయసులో ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతురాలి ఒంటిపై మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. కాగా, మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండటంతో ఎటువంటి ఆనవాళ్లు, ఆధారాలు లభించలేదు. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళను ఎవరో నవారు తాడును మెడకు బిగించి హత్య చేసి, సూట్‌కేసులో పెట్టి బాచుపల్లిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగి సుమారు 10 నుంచి 15 రోజులు అవుతుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల అదృశ్యం కేసులను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.