బడంగ్‌పేట, జూన్ 14: బడంగ్‌పేట పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలా సమస్య పరిష్కారం ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని విభాగాల అధికారులు పలుమార్లు పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా ఈ సమస్యను పరిశీలించారు. అయినా కూడా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు.
వర్షాకాలంలో పై నుంచి వచ్చే వరద ఈ నాలా ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎగువ ప్రాంతంలో వెంచర్లు వేసిన సమయంలో చాలామంది ఎక్కడికక్కడ నాలాను కుదించివేశారు. నాలా కింద భూములు ఉన్న యజమానులు తమ భూముల్లో మట్టి పోసుకోవడంతో నాలా నీళ్లు పోవడానికి దారి లేకుండా పోయింది. దీంతో వరదనీరంతా రోడ్లపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సమస్య కారణంగానే గతంలో భారీ వర్షం కురిసినప్పుడు వాహనాల రాకపోకలు నిలిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. గత రెండు మూడేండ్ల నుంచి ఈ సమస్యను అధికారులు దాటవేస్తూ రావడంతో చిన్న వర్షానికే వరద నీరు రోడ్లపైకి వస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
వరద నీటితోపాటు డ్రైనేజీ కలిపారు:
పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలాలో వరద నీటితోపాటు మురుగు నీరు పోవడానికి అక్కడే కనెక్షన్ కలిపేశారు. దీంతో మురుగునీరు బయటకు పోలేక మురికి కోపంగా మారింది. వరద నీరు, మురుగునీరు అంత ఒకే చోట చేరడంతో కుంటను తలపిస్తుంది. వర్షాకాలం కావడంతో ఈ సమస్య జటిలంగా మారే ప్రమాదం ఉంది. మురుగునీరు వరద నీరు అంత రోడ్లపైకి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మురికి కూపంగా..
పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర మురికి కోపంగా మారింది. మురుగు నీరు ఎటు పోలేక అక్కడే ఆగడంతో సమస్య జటిలంగా మారింది. బయటనుంచి వచ్చిన వాళ్లు జంతు కళేబరాలను సైతం అక్కడే వేయడంతో దుర్గంధ వాసన వెదజల్లుతోంది. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మురికిగుంటలో దోమలు, పందులకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రకరకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల కాలనీవాసులు బడంగ్‌పేట కమిషనర్ సరస్వతికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
నాలా సమస్యపై ఇరిగేషన్ అధికారుల తో మాట్లాడుతా : ఇందిరా దేవి బాలాపూర్ తహసీల్దార్
బడంగ్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న నాలా సమస్యను తప్పనిసరిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకుపోవాల్సి ఉంది. ఇరిగేషన్ అధికారులు నాలా ఎక్కడి నుంచి ఉందనేది వాళ్లు రిపోర్ట్ చేయవలసి ఉంది. నాలా సమస్యను పరిష్కరించకపోతే వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది.