BRS | కాప్రా, ఏప్రిల్ 22 : వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఏఎస్రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత వరంగల్ వేదికగా ఎండగట్టాలని సూచించారు. 27న పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ”రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిందని, హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకున్నాడు, మూగజీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవు” అని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు అని ఎమ్మెల్యే తెలిపారు. ”వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిన సొమ్ము రూ.13 వేల కోట్లు, రుణమాఫీ చేసింది రూ.14 వేల కోట్లు.. అంటే రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం చేసిండు” అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రజోత్సవ ఆవిర్భావ బహిరంగ సభకు తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.