
దుండిగల్, ఆగస్టు 31 : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధుడు నాలుగంతస్థుల భవనం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట ఆదిత్య లేక్‌వ్యూ అపార్ట్మెంట్లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన కల్వకుంట్ల రామలింగేశ్వరరావు(70), హైమావతి దంపతులు. వీరికి కొడుకు నాగవెంకట మోహన్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరు నగరంలోనే స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొడుకు తన కుటుంబంతో కలిసి జంగారెడ్డి గూడెంలో ఉంటున్నాడు. సొంతూరులో వస్త్ర వ్యాపారం చేసిన రామలింగేశ్వరరావు పదేండ్ల కిందట నగరానికి వచ్చి నిజాంపేట, ఆదిత్యలేక్వ్యూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 302ను కొనుగోలు చేసి భార్యతో కలిసి అందులోనే ఉంటున్నాడు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి 8:45 గంటల ప్రాంతంలో రామలింగేశ్వర్రావు తన టెర్రస్‌పైకి వెళ్లాడు. అర్ధరాత్రి దాటేవరకు అక్కడే ఉన్న అతడు ఒంటిగంట ప్రాంతంలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ గుర్తించి, అసోసియేషన్ ప్రతినిధులకు తెలుపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు.
మృతుడు రామలింగేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. రామలింగేశ్వరావుకు రెండు సార్లు గుండెకు బైపాస్ సర్జరీ జరిగిందని, అదే సమయంలో అతను షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్నాడని అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. పైగా గడిచిన మూడేండ్లుగా అన్నం సరిగ్గా తినడం లేదని, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకునే వాడని తెలిపారు. అయితే సోమవారం సైతం రామలింగేశ్వరరావును అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వైద్యశాలకు తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.
రాత్రి 8:45 గంటల ప్రాంతంలో టెర్రస్‌పైకి వెళ్లిన రామలింగేశ్వరరావు ముందుగా బ్లేడ్‌తో గొంతుకోసుకున్నాడు. రెండు గంటల అనంతరం తన ఫ్లాట్వద్దకు వచ్చి తిరిగి మళ్లీ టెర్రస్‌పైకి వెళ్లాడు(ఇది సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది). అనంతరం కాళ్లు, చేతులు, ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా కోసుకున్నాడు. అనంతరం బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.