జూబ్లీహిల్స్, జనవరి 24: యూసుఫ్‌గూడ డంపిగ్ యార్డులో వ్యర్థాలు డంప్ చేస్తుండగా కంపాక్టర్ మిషన్‌లో పడి ఓ ఆటో కార్మికుడు మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ ఆటో డ్రైవర్ మీసాల సుధాకర్ (40) మిషన్‌లోకి వెళ్లి చెత్త డంప్ చేస్తుండగా అందులో పడిపోయాడు. చెత్త వేసేందుకు వెళ్లిన వ్యక్తి బయటకు రాకపోవడంతో డంపింగ్ యార్డు సిబ్బంది బయట వేచి ఉన్న అతడి భార్యకు తెలియజేసి అందరూ కలిసి వెతకగా, సుధాకర్ మిషన్‌లో పడిపోయి ఉండడాన్ని గుర్తించారు.
బయటకుతీసి ఎస్ఆర్నగర్లోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం విసన్నపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌కు భార్య లక్ష్మీనర్సమ్మ , ఇద్దరు కుమార్తెలు, బాబు ఉన్నాడు. రాంకీ ఏజెన్సీ నిర్వహణలో కొనసాగుతున్న డంపింగ్ యార్డులో మృతి చెందడంతో పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ఆందోళనకు దిగారు. మధురానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.