
కుత్బుల్లాపూర్, ఆగస్టు19: ప్రేమించిన అమ్మాయి కాదన్నదని, తాను చనిపోతున్నట్లు స్నేహితుడికి ఫోన్ చేసి.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్ బషీర్బాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ గణేశ్‌నగర్‌కు చెందిన మణికంఠ(25) ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ.. తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు. 17న స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆమె తన ప్రేమను స్వీకరించడం లేదని, అందుకే చనిపోవాలని నిర్ణయించానని, అందరూ జాగ్రత్త అంటూ.. ఫోన్ పెట్టేశాడు. కంగారు పడిన స్నేహితుడు తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే మణికంఠ కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశాడు. వారు వెతుకుతున్న క్రమంలో గురువారం ఫాక్స్‌సాగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో చెరువులోంచి మృతదేహాన్ని వెలికితీసి చూడగా, మణికంఠగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.